అతని పేరు అరవింద్ రామస్వామి, వయస్సు 72 సంవత్సరాలు. ఇంటి వద్ద నుంచి నడుచుకుంటూ ఒక గ్రౌండ్ వద్దకు చేరుకొని మెట్లపై కూర్చుని ఇన్నేళ్ల తన జీవితాన్ని ఒకసారి నెమరువేసుకుంటూ సుఖాలు-దుఃఖాలు, కష్టాలు-నష్టాలు, జయాలు- అపజయాలు, ఆటలు-పాటలు, పద్ధతులు-పండగలు, పిల్లలు-అనుబంధాలు అన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకొని అందరూ ఉన్న అనాధగా ఎందుకు చనిపోవాల్సివచ్చింది అనేదే ఈ కథ....
ఆ రోజు సూర్యోదయం ఇంట్లో అరవింద్ రామస్వామి ఒక్కడే ఉన్నాడు రోజువారీ పనుల్లో భాగంగా ఏవో పనులు చేసుకొని రెడీ అవుతున్నాడు.
తన భార్య ఫోటో వద్దకు వచ్చి దీపం వెలిగించి కాస్త కన్నీళ్ళు పెట్టుకొని మన పిల్లలు విడిచి వెళ్ళినా, నువ్వు నాకు తోడుగా ఉంటావు అనుకున్నా కానీ నువ్వు కూడా నన్ను ఒంటరి వాన్ని చేసి వెళ్ళిపోతావు అనుకోలేదు.
అనుకొని కన్నీళ్లు తుడుచుకొని నీరసంగా నడుచుకుంటూ టేబుల్ వద్దకు వచ్చి కూర్చొని పిల్లల ఫోటోల వైపు చూసి కన్నీళ్లు పెట్టుకొని ఒక లెటర్ రాస్తాడు.
తర్వాత పిల్లల ఫోటోల దగ్గరకు వచ్చి చేతితో తడిమి లెటర్ ని సంచిలో పెట్టుకొని దాన్ని భుజానికి వేసుకుని బయటకు వచ్చి చెప్పులు వేసుకొని తలుపులకు తాళం వేసి ముందుకు నడిచి ఒక్కసారి వెనక్కి తిరిగి ఇంటిని చూసుకొని బాధగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తాడు.
అలా నడుచుకుంటూ ఒక గ్రౌండ్ వద్దకు చేరుకున్నాక ఐస్ క్రీమ్ బండి వద్ద ఉన్న పిల్లలందరికీ ఐస్ క్రీమ్ లు కొనిచ్చి
గ్రౌండ్ వైపు నడుస్తూ తనని తాను పరిచయం చేసుకుంటూ అందరికీ నమస్కారం నా పేరు అరవింద్ రామస్వామి నా వయసు 72 సంవత్సరాలు నా భార్య పేరు జానకి ఈ మధ్యే కాలం చేసింది. నాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. వాళ్లు విదేశాల్లో స్థిరపడ్డారు.
మేము ఉన్నామా పోయామా అని పట్టించుకునే తీరిక కూడా వాళ్లకి లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయింది అని కబురు చేసినా ఎవ్వరూ రాలేదు. మా ఆస్తులు పంచుకున్నారు కానీ మా మంచి, చెడులు మాత్రం పంచుకోలేదు. రేపు నేను చనిపోయినా నా పరిస్థితీ అంతే కదా. అని ఆగి గ్రౌండ్ వైపు చూపిస్తూ,
ఇదిగో ఇదే నా ప్రపంచం. చిన్నప్పుడు గోలీలు ఆడుకుంది, బడికి వెళ్లేటప్పుడు దొంగా పోలీస్ ఆటాడుకుంది, కాలేజ్ అప్పుడు క్రికెట్ ఆడింది, పెళ్లి అయ్యాక ఆదివారాల్లో సేద తీరింది, ఇదిగో... ఈ ముసలితనంలో అవన్నీ నెమరు వేసుకోవడానికి గడిపింది ఈ గ్రౌండ్ లోనే.
అని చెబుతుండగా గ్రౌండ్ అంతా చూస్తే పచ్చని చెట్లతో, పక్షుల కిలకిలలతో ఎంతో అందంగా ఉంది. గ్రౌండ్ కు చుట్టూ మెట్లు ఉంటాయి వాటి మీదనుంచి దిగుతూ గ్రౌండ్ కు వెళ్లాలి.
అలా అరవింద్ రామస్వామి చెప్పాక , పై మెట్టు పై కూర్చుంటాడు. సంచీలోంచి డైరీ పెన్నుని తీసి చేతిలో పట్టుకొని ఒక్క క్షణం గట్టిగా శ్వాస పీల్చుకుని వదిలి
అరవింద్ రామస్వామి : ఏ పని చేతకాని ఈ ముసలితనం కంటే భార్యా పిల్లలతో గడిపిన ఆ రోజులే ఎంతో బాగుండేవి అనుకోగానే
పక్కనే కూర్చుని ఉన్న ఒక 45 సంవత్సరాల వ్యక్తి లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని తల పట్టుకొని
వ్యక్తి : ఏం సంసార జీవితమో ఏంటో ఏమీ అర్థం కావడం లేదు, సాగరానైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేం అని పెద్దలు ఊరికే అన్నారా , అయినా యుక్త వయసులో నా కాలేజీ రోజులే బెటర్ ఎంతో సంతోషంగా గడిచిపోయేవి, అనుకోగానే పక్కనే కూర్చున్న పాతికేళ్ళ(25) కాలేజీ కుర్రోడు లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని
కాలేజీ కుర్రోడు : ఈ కాలేజీ గోలేంటీ, ఈ సెమిస్టర్ లేంటీ ఈ ల్యాబ్ లేంటీ, హ... అని నిట్టూర్చి,, నా చిన్నతనంలో బడికి వెళ్లే రోజులు ఎంత సంతోషంగా గడిచిపోయేవో అనుకోగానే పక్కనే స్కూలు బ్యాగు వేసుకొని కూర్చున్న 15 సంవత్సరాల బాలుడు(విద్యార్థి) లేచి నిల్చొని కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని
విద్యార్థి : ఇదెక్కడి స్కూలు రా బాబు, చిన్న పిల్లవాడిని అని కూడా చూడకుండా ఈ టీచర్లందరూ వాయ గొడుతున్నారు. అబ్బో.. ఇదంతా మన వల్ల కాదు ........ అయినా బడికి వెళ్లకముందు పసితనంలో ఎంత చక్కగా ఆడుకునే వాడినో ,, అని అనుకోగానే ఐస్ క్రీమ్ తింటూ పక్కన కూర్చున్న బాలుడు పైకి లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు దిగి కూర్చొని
బాలుడు : హు..... ఒక్క ఐస్ క్రీమ్ కోసం ఎన్ని దెబ్బలు తినాల్సి వచ్చింది అదే పక్కింటి అన్న(విధ్యార్ది) స్కూలు కి వెళ్తుంటే రోజూ 5 రూపాయలు ఇస్తున్నారు.. హ... తను ఎంత లక్కీయో. అనుకోగానే పక్కనే స్కూలు బ్యాగు వేసుకొని కూర్చున్న విధ్యార్ది లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు పైకి ఎక్కి కూర్చొని
విధ్యార్ది : త్వరగా 10 టెన్త్ అయిపోతే బాగుండు హ్యాపీ గా కాలేజీ లైఫ్ అనుభవించవచ్చు. అనుకోగానే పక్కనే కూర్చున్న కాలేజీ కుర్రోడు లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు పైకి ఎక్కి కూర్చొని
కాలేజీ కుర్రోడు : ఈ వెధవ కాలేజీ అయిపోగానే, ఏదో ఒక ఉద్యోగం సంపాదించి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు . అనుకోగానే పక్కనే కూర్చున్న వ్యక్తి లేచి నిలబడి కాస్త పక్కకు జరిగి ఒక మెట్టు పైకి ఎక్కి కూర్చొని
వ్యక్తి : ఈ సంసారాన్ని ఈదడం మన వల్ల అయితే కాదు... హ్యాపీ గా రిటైర్ అయిపోయి దర్జాగా కాలు మీద కాలు వేసుకొని బ్రతికేస్తే ఎంత బాగుంటుందో. అనుకోగానే యధాతధంగా పక్కనే ముసలివాడు అరవింద్ రామస్వామి కూర్చొని ఉండాలి కానీ లేడు రెండు, మూడు మెట్లు పైకెక్కి చూడగా అరవింద్ రామస్వామి పడుకొని ఉన్నాడు పక్కనే డైరీ తెరిచి ఉంది అందులో
👉పిల్లలకు ఉన్నత చదువులు చదివించడమే కాదు, ఉన్నత విలువలూ నేర్పించాలి, అప్పుడు వాళ్లు మనతో ఉన్నా విదేశాలలో ఉన్నా మన గౌరవాన్ని, విలువలను కాపాడుతూనే ఉంటారు, మన వెన్నంటే ఉంటారు... ఇక సెలవు . అని రాసి ఉంది.
అలా అరవింద్ రామస్వామి విగతజీవిగా పడి ఉన్నాడు.
అక్కడే ఉన్న చెట్లు తమ ఆకులను, పూలను విధిలించి, పక్షులు రెక్కల ఈకలను విదిలించి తమ సంఘీభావాన్ని తెలియజేశాయి.
ఒక్కసారిగా అక్కడ గాలి దుమారం చెలరేగి సుడిగుండం లాగా ఆకాశంలోకి ప్రవహిస్తూ వెళ్లిపోవడంతో
🏵️సమాప్తం🏵️
✍️ రచయిత :తన్నీరు రమేష్
.png)


No comments:
Post a Comment